సాహిత్యము సౌహిత్యము – 1 : చాటువు
by
V.V.Krishna Rao
·
April 30, 2017
శ్రీ శారదా వాత్సల్య స్ఫూర్తిః :-
సంస్కృతంలోను, తెలుగులోను, ఆంగ్లంలోను ఆ మాటకివస్తే అన్నిభాషలలోను చాటుసాహిత్యం ఆయా సంస్కృతులలోని జనబాహుళ్యానికి చాలా ప్రీతిపాత్రమై తరతరాల సాంస్కృతిక స్రవంతిలో అవిభాజ్య ప్రవాహమై ప్రకాశిస్తోంది. శ్రీ శారదామాత అనుగ్రహంతో సమయానుసారంగా ఆ తల్లి తోపించిన విషయాలు సంక్షిప్తంగా ముచ్చటించుకుందాం!
చాటువు అనే మాట సంస్కృతంలోంచి వచ్చింది. దీనికి హృదయాకర్షకమైన మాట అని భావం. ఇది తరచుగా ఛందస్సులోనే ఉంటుంది. ఆంగ్లంలో దీనిని Epigram అని లేక Fugitive verse అని అంటారు.
మన తెలుగువారికి, అందునా మన పూజ్యమాతామహులైన శ్రీప్రసన్నానందనాథ దీక్షానామాంకితులైన బాలాంత్రపు వేఙ్కట కృష్ణ రాయవర్యులకు భారతం పంచప్రాణాలూను. అందువల్ల భారత విషయంతోటే చాటురంగప్రవేశం చేద్దాం.
పూర్వం ఒక రాజుగారి ఆస్థానంలోకి ఒక సంస్కృత కవి/పండితుడు వెళ్ళేడు. రాజుగారు మనలాగే భారతప్రియులు. కవివరుడికి రాజుగారు ఒక సమస్య ఇచ్చేరు. ద్రౌపదికి ఐదుగురు భర్తలుకదా! మరి వారి
వావివరసలగురించి ఆయనకి సందేహం వచ్చింది. ఉదాహరణకి ద్రౌపదికి ధర్మరాజు భర్త ఐతే మిగిలిన నలుగురూ మరదులు ఔతారు. అలాగే అర్జునుడు భర్త ఐతే పై ఇద్దరూ బావలు, క్రింది ఇద్దరూ మరదులు ఔతారు. సహదేవుడు భర్త ఐతే పై నలుగురు బావలౌతారు. ఈ విధంగా ఆ ఐదుగురిలో ఒకరు భర్త ఐతే మిగిలిన నలుగురు ఏమౌతారో వివరిస్తూ ఒక అనుష్టుప్ శ్లోకంలో వర్ణింౘమన్నాడట!
కవిగారి శ్లోకం:
“ద్రౌపద్యాః పాండు తనయాః
పతి దేవర భావుకాః |
న దేవరో ధర్మరాజః
సహదేవో న భావుకః ||
అంటే అర్థం ద్రౌపదికి పాండవులు భర్తలు, మరదులు, బావలు కూడా ఔతారు. కాని ధర్మరాజు ఏవిధంగానూ మరది కాడు. అలాగే సహదేవుడు ఎప్పుడూ బావకాడు. మిగిలిన ముగ్గురూ ఆయా దర్భానుసారంగా బావో, భర్తో, మరదో ఏదోఒకటి ఔతాడు. ఇదేవిషయాన్ని సర్వజ్ఞసింగభూపాలుడు ఒకతెలుగుకవికి సమస్యగా యిచ్చి ఆశువుగా కందపద్యంలో చెప్పమన్నాడట!
ఆ కందపద్యం:
“పతి మరదియు సహదేవుడు,
పతి బావయు ధర్నరాజు, బావలు మరదుల్
పతులు నర నకుల భీములు,
పతులేవురు సింగభూప పాంచాలి కిలన్ !
అని ఇంత సొగసుగా చూప్పేడుట. ఇటువంటి ఘట్టాలు మన పూర్వుల బుద్ధి వైభవాన్ని మనకి తెలియజేస్తాయి. మరొకమారు మరొకవిషయం ముచ్చటించుకుందాం!